సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు ఫై ఫోర్జరీ కేసు ఇటీవల సంచలనంగా మారింది. వివరాలలోకి వెళ్ళితే సోము.. అల్లుడు కవల వెంకట నరసింహంపై రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐ బ్యాంకులో లోన్ తీసుకున్నారని జయరామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసును నమోదు చేశారు. దీనికి సంబంధించి సోము.. కుమార్తె సూర్యకుమారి ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ… ‘‘నా తండ్రికి, లోన్ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని.. ఇదంతా రాజకీయ కుట్ర.. నా తండ్రి ఇంటికి, మాకు ఎటువంటి రాకపోకలు, సంబంధాలు లేవు. వివాహం తరువాత నా తండ్రి ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు. నా భర్త బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే లోన్ తీసుకున్నాం. కావాలనే మాపై కేసు పెట్టారు.. డబ్బు లావాదేవీలకు సంబంధించి నిన్న మధ్యవర్తుల సమక్షంలో రాజమండ్రిలో చర్చలు జరిగాయి. మా తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సూర్యకుమారి ఆరోపించారు.
