సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు-కాతేరు మధ్యలో గామన్ బ్రిడ్జి రోడ్డులో నేటి శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కావేరి ట్రావెల్స్ బస్సు రాంగ్ రూట్‌లోకి వెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో విశాఖపట్నం మద్దెలపాలేనికి చెందిన కోనా హోమిని కళ్యాణి(21) అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరో 17మందికి కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా విశాఖపట్నానికి చెందిన యువతే. వీరంతా ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్ బయలుదేరినట్టు చెబుతున్నారు. బస్సు గామన్ రోడ్డులోకి వచ్చేసరికి ఎదురుగా ఒక స్కూటీ వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును ఎడమ వైపునకు మళ్లించడంతో డివైడర్ పైకి బస్సు ఎడమ వైపు టైర్ ఎక్కింది. దీంతో బస్సు గాలిలో లేచి బోల్తా కొట్టి 200 మీటర్లు దూసుకుపోయినట్టు తెలుస్తోంది. బస్సులో బెడ్‌లు, సీట్లు తునాతునకలై బయటకు వచ్చేశాయి. లోపలనుంచి ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు స్పందించి సెల్ ఫోన్ల లైట్ల వెలుగులో బస్సు వెనుక అత్యవసర ద్వారాన్ని పగులగొట్టి బయటకు తీశారు.
