సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు నేడు, గురువారం, మరియు రేపు శుక్రవారం కూడా బంద్ పాటించనున్నారు. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో నిన్న బుధవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్‌ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త ప్రకటించారు. దానితో నేటి గురువారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగాయి బ్యాంక్ యూనియన్లు. దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకుల సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య వేదిక– యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమణ ఉంటుందని యూనియన్లు స్పష్టం చేస్తుండగా, అటువంటి హామీ ప్రభుత్వం నుంచి రాలేదు.
