సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సిపిఐ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ నేడు, ఆదివారం .భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భీమవరం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి ప్రజా దర్బార్ లో గుండె వేదనతో అమరావతి రైతు చనిపోవడం దురదృష్టమని ఇది ముమ్మాటికీ సర్కారు హత్యేనని, అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూసే నైతిక బాధ్యత చంద్రబాబు పై ఉందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ మాఫియా ప్రజలను పట్టి పీడిస్తుందని, భారీ టికెట్స్ రేట్లు పెట్టి ప్రభుత్వాల అండతో ప్రజలను దోచుకొంటుందని విమర్శించారు. మహాత్మా గాంధీ ని, నెహ్రూ ను చరిత్రలో తుడిచేయడానికి మోడీ పరివారం కుయుక్తులు పన్నుతున్నారని కె.నారాయణ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ మొదట చేగువేరా పేరుతో ప్రేరణ పొంది, ఇప్పుడు బిజెపి ప్రాపకం కోసం సనాతన ధర్మానికి ఛాంపియన్ అని చెప్పుకోవడం శోచనీయమని, ఆయన వ్యక్తిగత జీవితం సనాతనాని వ్యతిరేకమని సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన లేదని ఆత్మద్రోహం చేసుకోవద్దని, సనాతన ధర్మం అంటే ప్రభుత్వం నుంచి పవన్ బయటకు వచ్చేయాలని నారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సనాతన వాది కాదని అవసరాల రీత్యా మోడీతో అంటకాగుతున్నాడని అందితే జుట్టు అందక పోతే కాళ్ళు పట్టుకునే నైజం చంద్రబాబుదని, జగన్ కూడా మోడీ బాటలోనే నడుస్తాడని నారాయణ చురకలు అంటించారు. ఈ నెల 18న లక్షలాది మందితో ఖమ్మంలో జరిగే వందేళ్ల సిపిఐ ముగింపు వేడుకలను జయప్రదం చేయాలని నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నేతలు కోనాల భీమారావు, చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, కలిశెట్టి వెంకట్రావు, మల్లుల శ్రీనివాసరావు, వై.వి.ఆనంద్, కోన గొల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
