సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలోని పంటకాలువలకు నిన్న గురువారం మధ్యాహ్నం గోదావరి జలాలను విడుదల చేసారు. ముందుగా తూర్పు గోదావరి జిల్లాకు రబీ అనంతరం మూసివేసిన సాగునీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తూర్పు డెల్టా హెడ్ స్లూయిజ్ వద్ద జిల్లా ఇన్చార్జి మంత్రి సీహెచ్. వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, కలెక్టర్ మాధవీలత గోదావరి మాత కు పూజలు నిర్వహించారు. అనంతరం చీర, పండ్లు, పసుపు, కుంకుమ, పువ్వులను గోదావరి నదికి సమర్పించారు. మంత్రులు వేణు, వనిత హెడ్ స్లూయిజ్ గేట్లను ఎత్తే స్విచ్‌ను ఆన్‌చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాది ముందస్తు గానే నీటిని విడుదల చేయడం వల్ల పంటను ప్రకృతి విపత్తుల నుంచి రైతాంగం కాపాడుకోగలిగిందని, ఈ ఏడాది జూన్ 1నే సాగునీటిని విడుదల చేస్తున్నామని, అధికారులు సమ్వనయంతో రైతులను సకాలంలో నాట్లు వేసేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు ఇదే ముహూర్తానికి మధ్య, పశ్చిమ గోదావరి జిల్లా లోని కాలువలు కోసం నిడదవోలు మండలం విజ్జేశ్వరం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నం ప్రాంతంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యదేవ మరో ఆరుగురు సిబ్బంది తో కలసి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేశారు.
