సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశాలు జారీచేసింది. నిజానికి వైసీపీ ఓడిపోగానే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంతో పాటు జిల్లాలోని కీలక ఏఎంసీ పాలకవర్గాలు రాజీనామా చేశాయి. అయితే తాడేపల్లిగూడెం, నర్సాపురంలో మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు జీవో జారీచేసింది. కొత్త కమిటీలు ఏర్పాటు చేసేంత వరకు ఇన్‌ఛార్జ్‌ల పాలన కొనసాగనుంది. జిల్లా రైతాంగ వ్యవస్థ కు ఆయువు పట్టులాంటి.. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఆచంట, నర్సాపురం, పాలకొల్లు, ఉండి, ఆకివీడులో వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేల సిఫారసు మేరకు పాలకవర్గాలను ఏడాది పరిమిత కాలానికి కమిటీలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. జిల్లాలో తాడేపల్లిగూడెం వంటి చోట్ల మరో ఏడాది పొడిగించారు.ఇప్పడు అవి రద్దయ్యాయి. సెలక్షన్ గ్రేడ్ అయితే మార్కెటింగ్ శాఖ జేడీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవవరిస్తారు. ఇక కొత్త పాలకవర్గాలో సాధ్యమైనంత ఎక్కువ డైరెక్టర్ పదవులు దక్కించుకోవడానికి ఎవరికీ వారే కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. అయితే ఈసారి జిల్లా కేంద్రం భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెంలో ఏఎంసీ చైర్మన్ తో పాటు డైరెక్టర్స్ పదవులు కూడా జనసేనకు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జిల్లాలో గత 4 దశాబ్దాలుగా చక్రం త్రిప్పిన టీడీపీ కీలక నేతలు తమకు ఏఎంసీ చైర్మన్ పదవులు అయిన ఇచ్చి గౌరవించాలని జనసేన ఎమ్మెల్యేలను కోరుకొంటున్నారు. ఇకఫై వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి..
