సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన భూ రీ–సర్వేకు స్థానిక వాలంటర్స్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఇందులో భాగంగా భూ, ఇంటి యజమానులకు రీ సర్వే గురించి ముందుగా సమాచారం అందించే విధంగా పట్టణాల్లో వార్డు వలంటీర్ల ద్వారా సమాచారం అందించాలని ఆదేశాలు అందాయి. ఈ సర్వే వచ్చే ఏడాది 2023 జూలై నెలాఖరు నాటికి పూర్తి అవుతుందని సమాచారం. ఫారం–1 ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జిల్లాలోని జిల్లా కేంద్రం భీమవరంతో పాటు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు మునిసిపాలిటీలకు సంబంధించి రీ–సర్వే అంశాలపై ఇప్పటికే వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ మునిసిపాలిటీలో డ్రోన్‌ల ద్వారా రీ–సర్వే చేసే సమయానికి పట్టణంలో గ్రౌండ్ కంట్రోల్ రిమోట్ పాయింట్లను గుర్తిస్తున్నారు.దీనిలో భాగంగా ఫారం–16ఏ నమోదు కార్యక్రమం జరుగుతోంది ఇదే సమయంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి సర్వే చేయనున్నారు. దీని తరువాత 16ఏఏ నమోదు చేపట్టనున్నారు. అంటే అధికారులు ప్రతీ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ అసెస్‌మెంట్‌లో నమోదు కాని భవనాలు, ఖాళీ స్థలాలలను ఈ ఫారంలో నమోదు చేస్తారు. దీనివల్ల కొత్త ఏడాదిలో టాక్స్ లు వేసి అదనపు ఆదాయం పొందడానికి రంగం సిద్ధం అవుతుంది.
