సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో గత రాత్రి జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్.. వారి ఆదేశాల మేరకు గత సోమవారం రాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. భీమవరంతో పాటు ఇతర కీలక పట్టణాలలో రైల్వే మరియు బస్ స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్) ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి, అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలించారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారుకార్గో సర్వీస్ సెంటర్లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలించి, పంపబడుతున్న పార్శిళ్ల వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా సంఘటనలు ఏవైనా దృష్టికి వస్తే, తక్షణమే డయల్ 112 ద్వారా లేదా స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
