సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు గత శుక్రవారం జిల్లాలో భారీగా కీలక అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చెయ్యడం విశేషం. నరసాపురం ఎంపీ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుమి త్‌కుమార్ ప్రకటించారు. వైసీపీ తరపున గూడూరి ఉమాబాల రెండు సెట్లు, ఆమె భర్త గూడూరి జగదీష్ ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థి గోటేటి లక్ష్మీనరసింహారావు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థి ఉందుర్తి ప్రసన్నకుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఇక జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్లు : భీమవరంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండో రోజు నలుగురు అభ్యర్థులు ఎనిమిది సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో సీఏ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు తరపున ఆయన సతీమణి రమాదేవి ఒకటి, వైసీపీ నుంచి డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు రెండు, ఆయన సోదరుడు పీవీఎస్ గోపాలకృష్ణంరాజు రెండు సెట్లు సమర్పించారు. కాంగ్రెస్ నుంచి వేగేశ్న గోపాలకృష్ణంరాజు మూడు సెట్లు సమర్పించారు. తాడేపల్లిగూడెంలో ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.చెన్నయ్య తెలిపారు. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, స్వతంత్య్ర అభ్యర్థి దేవతి పద్మావతి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక తణుకు అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురు అభ్యర్థులు 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో బీవీ రమణ తెలిపారు. టీడీపీ తరపున ఆరిమిల్లి రాధాకృష్ణ నాలుగు సెట్లు, ఆయన సతీమణి కృష్ణతులసి నాలుగు సెట్లు, వైసీపీ తరపున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెండు సెట్లు, ఆయన సతీమణి లక్ష్మీకిరణ్ రెండు సెట్లు సమర్పించారు. పాలకొల్లులో నలుగురు అభ్యర్థులు ఎనిమిది సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివన్నారాయణరెడ్డి తెలిపారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రెండు సెట్లు, ఆయన సతీమణి రెండు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కొలుకులూరి అర్జునరావు రెండు సెట్లు, కొలుకులూరి నాగ భాస్కరరావు రెండు సెట్లు దాఖలు చేసినట్లు చెప్పారు. ఆచంటలో నలుగురు అభ్యర్థులు ఎనిమిది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.స్వామినాయుడు తెలిపారు. వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాధరాజు రెండు, ఆయన తనయుడు నరసింహరాజు రెండు సెట్ల నామినేషన్లను టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ మూడు, ఆయన తనయుడు వెంకటసురేష్ ఒకటి, నామినేషన్లను సమర్పించారు. నరసాపురంలో ఇద్దరు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ అంబరీష్ తెలిపారు. వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మూడు సెట్లు, ఆయన భార్య శారదావాణి మూడు సెట్లు సమర్పించారు.
