సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఇరిగేషన్ శాఖపై ఇరిగేషన్, డ్రైన్స్ అధికారులు సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట, తణుకు ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధాకృష్ణ, జిల్లా సాగునీటి సంఘాల అధ్యక్షులు మురళి కృష్ణంరాజు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబికి సంబంధించి సాగునీటి సరఫరాపై నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారంపై సాగు నీటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇరిగేషన్ అధికారులు జిల్లాలో ఆయకట్టు వివరాలు, వంతులు వారీగా సాగునీటి సరఫరా, నీటి లభ్యత, కాలువల మూసివేత అనంతరం చేపట్టే పనులపై ఎమ్మెల్యే సమక్షంలో వివరించారు.. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కాలువలు, డ్రైన్స్ సంబంధించి చేపట్టవలసిన పనులకు ఫిబ్రవరి నెలాఖరు నాటికి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పాలు కట్టేసే నాటికి చేయవలసిన పనులకు సిద్ధంగా ఉండాలన్నారు. కాలువలు మూసివేత తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలుపెడితే పనులు చేపట్టడానికి సమయం సరిపోదన్నారు. ఆచంట ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో రబి సాగు ఆయకట్టు విస్తీర్ణం, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు, రబి పంటకు సాగునీరు లభ్యత, తదితర వివరాల గణాంకాలు కావాలని కోరగా సంబంధిత ఎస్ఈ సమావేశంలో లేకపోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ఇక మీదట సమీక్షసమావేశాలకు తప్పనిసరిగా జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. జెసి రాహుల్, ఇరిగేషన్ ఈఈ సురేష్, డ్రైన్స్ ఈఈ సత్యనారాయణ, ఇరిగేషన్, డ్రైన్స్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
