సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైతుల ధాన్యం సొమ్ము బకాయిలు ప్రభుత్వం వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం ఆద్వర్యంలో జిల్లా కేంద్రం భీమవరం పట్టణశివారు విస్సాకోడేరు లో జరిగిన ధర్నాలో బలరాం రైతులకు మద్ధతు, సంఫీుబావం తెలిపి మాట్లాడారు. నెలలు తరబడి రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ప్రధానంగా సన్నచిన్నకారు రైతులు, మద్యతరగతి రైతులు, కౌలురైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వాపంటకు పెట్టుబడులకోసం రైతులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, కరెంటు చార్జీలు ఆలస్యం అయితే వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని రైతులకు చెల్లించాల్సిన బకాయిలకు మాత్రం అతీగతీ లేదని విమర్శించారు. జిల్లాలో ఇప్పటికీ 800కోట్లకు పైగా బకాయిలున్నట్లు తెలుస్తోందని బలరాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు,రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా తక్షణం చెల్లించాలని బలరాం డిమాండ్ చేశారు. కేంద్రం ఇటీవల క్వింటాల్ ధాన్యానికి కేవలం మద్ధతు ధరను రూ 117 పెంచడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కలిదిండి గోపాలరాజు, కలిదిండి బంగార్రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేషపు అశ్రియ్య, కౌలురైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
