సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల లోని స్వయం భువుడు అయిన చిన్న తిరుమలేశుని వైశాఖమాస బ్రహ్మోత్సవాలు నేడు, ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు వచ్చేనెల 7వ తేదీ వరకు జరుగుతాయి. ఈ రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారునిగాను, పెండ్లికుమార్తెగాను అలంకరించారు. నేటి రాత్రి 8 గంటలకు గజవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. వచ్చే నెల 4న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 5న స్వామి వారి రథోత్సవం, 6న శ్రీచక్రవార్యుత్సవం, ధ్వజావ రోహణ, 7న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పూర్తీ అవుతాయని ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు.కాగా బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో వేండ్ర త్రినాధరావు పేర్కొన్నారు.
