సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ పారిశ్రామిక చరిత్రలో మహోన్నత నిత్యా శ్రామిక దిగ్గజం, మానవత్వం పరిమళించిన మహాదాత శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై టాటా విజయపతాకను రెపరెపలాడించిన రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. BP అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. గత బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. 3రోజుల క్రితం ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ట్వీట్ చేసిన మూడురోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా.. ఆయన పుట్టిన పదేళ్లకు విడిపోవడంతో, రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్‌బాయ్ టాటా వద్ద పెరిగారు. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. 1961లో ఆయన టాటా గ్రూపులో తొలుత టాటా స్టీల్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఎదిగారు. 1991లో జేఆర్డీ టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు.టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాంలోనే 10లక్షల మంది ఉద్యోగులుతో లక్షల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన ఆదాయంలో 60శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
