సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన టీడీపీ, బీజేపీల కూటమి ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా గత 5 ఏళ్లుగా పింఛను లు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న వాలంటీర్లు లేకుండానే.. ప్రభుత్వ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు, సోమవారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో నేటి సోమవారం ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్‌ను అందజేశారు. పిఠాపురంలో పింఛన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలుకు చేరుకొని నేటి ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు 4వేలు చప్పున అందజెయ్యడం దానికి మరో 3వేలు జోడించి ఈసారి 7వేలు ఇవ్వడం శుభపరిణామం అన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ డాక్టర్స్ డే (Doctors Day) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన రోగులపట్ల ప్రత్యేక శ్రద్ధను, సంరక్షణను చూపించాలని, అదే విధంగా రోగులు సైతం వైద్యులపట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో వైద్యులపైనా, ఆసుపత్రులపైనా దాడులు చోటు చేసుకొంటున్నాయని, వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అంశాన్ని, వైద్య వృత్తిలో ఉన్నవారికి రక్షణ ఇస్తున్న చట్టం అమలు విషయాన్ని రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.
