సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా గత బుధవారం రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సన్వీక (7) దిల్‌సుఖ్ నగర్ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్ సంధ్య థియటర్ వద్దకువచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి అక్కడికక్కడే మరణించగా, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. సినిమా చూడటానికి వచ్చిన ఆ కుటుంబంలో జరిగిన విషాదం అందరిని కలచి వేస్తుంది.
