సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్నఏపీలో ధన ప్రవాహం జోరు అందుకొంది. బంగారం, డబ్బు , లిక్కర్ ప్రవాహం ఏరులై పారుతుంది. అధికారులు ఎన్నిరకాలుగా చర్యలు, నిఘా చేపడుతున్నప్పటికీ అడ్డదారులలో అవి చేరిపోతున్నాయి. తాజాగా నేడు, శుక్రవారం ఏపీలోని కాకినాడ జిల్లా,పెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం 8 కిలోల 116 గ్రాములు పట్టుబడింది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దానితో పాటు 46 కేజీల వెండిని కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ బంగారం, వెండిని బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనంలో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు వివరించారు. నిందితులు కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకున్నారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఎన్నికల వేళ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెద్దాపురంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం ఇది ఏ పార్టీ అభ్యర్థులకు సంబందించినది అన్న చర్చ జరుగుతుంది.
