సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘ కాలంగా పలు అడ్డంకులను అధిగమించి ఆసియా ఖండంలోనే ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో గత వరదలకు ‘డయాఫ్రంవాల్’ వద్ద దెబ్బతిన్న గ్యాప్ 1, 2 ప్రాంతాల్లో ఏర్పడిన అగాధాలను పూడ్చివేసే కార్యక్రమాన్ని జలవనరుల శాఖ అధికారులు తాజగా ప్రారంభించారు. ప్రాజెక్టు రివ్యూ పానెల్ సూచించిన డిజైన్ ప్రకారం పూడ్చివేత పనులు ప్రారంభించినట్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు ప్రకటించారు. డయాఫ్రంవాల్‌కు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల వైపు కుడి, ఎడమల్లో పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో గ్యాప్ 1, 2ల వద్ద ఒక ప్రాంతంలో 26 మీటర్లు, మరోచోట 24 మీటర్ల మేర భారీ గుంతలు ఏర్పడ్డాయని, వాటిలోకి ఇసుక నింపి అనంతరం ఆ ప్రాంతాన్ని వైబ్రో కంపాక్షన్ ద్వారా గట్టిపరుస్తారని తెలిపారు. వైబ్రో కంపాక్షన్ పనులు పూర్తయిన తర్వాత నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చే నివేదిక ఆధారంగా జెట్ గ్రౌడింగ్ చేసి, దీనికి సమాంతరంగా కొంతమేర డయాఫ్రంవాల్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
