సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు సోమవారం ఏపీలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బంది చేసే త్యాగాలు మరువలేనివని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. పోలీస్ లు తమ వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని.. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత పాలకులు పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించు కున్నారని విమర్శించారు. ఫలితంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ ఇబ్బందులు చవిచూశారన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ సమర్థంగా పని చేసేలా చూస్తోందని, పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
