సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షినాది బాషలలో ప్రఖ్యాత సినీ గాయనిగా అనేక దశాబ్దాలుగా విరాజిల్లుతున్న వాణీ జయరామ్(78) ఇకలేరు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం. హిందూస్థానీ క్లాసికల్ సింగింగ్‌లో ప్రావీణ్యం పొందిన వాణీ జయరామ్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 10వేలకు పైగా పాటలు పాడారు . కెవి.మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాధన్, ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించగా, అవార్డు అందుకోకుండానే ఆమె కన్ను మూయడం బాధాకరం. మూడు జాతీయ పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. వాణీ జయరామ్ మరణంతో సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాలు తెలుపుతున్నారు.
