సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి దూరంగా ఉన్నపటికీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 272ను అవలీలగా దాటింది. కాగా, 18వ లోక్‌సభ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ, 17వ లోక్‌సభను రద్దు చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రభుత్వ రాజీనామాను ప్రధాన మోదీ స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. నేడు, బుధవారం ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరిగింది. దీనిలో ప్రధాని మోడీ తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జేడీయూ నేత నితీష్‌ కుమార్ అందజేశారు. నేటి రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతిని కలుసుకోనున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను రాష్ట్రపతికి అందజేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *