సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరు కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారపాటి చౌదరి (తపన)కి నేడు, శుక్రవారం ఉదయం త్రుటీలో పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపంలో కొవ్వూరు వైపు ప్రయాణిస్తున్న స్కూల్ బస్ కి గుర్తు తెలియని వ్యక్తి అడ్డు రావడంతో ఒక్కసారిగా స్కూల్ బస్సు రోడ్డుపై ఆపివేశారు. అదే సమయంలో స్కూల్ బస్సు వెనుక ఉన్న తపన చౌదరి టయోటా కారు నిలుపుదల చేయడంతో వెనుక నుండి వేగం గా వచ్చిన క్వారీ లారీ బలంగా ఢీకొనడంతో బస్సుకి లారీకి మధ్య తపన చౌదరి ప్రయాణిస్తున్న కారు నుజ్జు అయింది. అయితే రోడ్డు ప్రమాదం నుండి తపన చౌదరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన బిజెపి నాయకులు , తపన చౌదరి అభిమానులు పెద్ద సంఖ్యలో కొవ్వూరు చేరుకున్నారు. వచ్చే ఎన్నికలలో ఏలూరు పార్లమెంట్ కు చాలా బలమైన బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న తపన చౌదరి స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుండి బయట పడ్డారని తెలిసి బిజెపి నాయకులు ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోడ్ ప్రమాదంపై కేసు నమోదు చేసిన కొవ్వూరు పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
