సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ‘ ద్వారా మత్స్యకారుల సంక్షేమంతోపాటు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, ఆదివారం ఆదేశించారు.భీమవరంలోని జిల్లా బిజెపి కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ను నూతనంగా ఎన్నికైన ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు మైల వసంతరావు, పాలకవర్గం సభ్యులు కలసి జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెరైన్ సైడ్ ఉన్న సంత మార్కెట్లులో ఫిష్ మార్కెట్లలో వసతులు కల్పించడం, పంచాయతీరాజ్ చెరువుల వేలంలో 10% పరిమితి దాటకుండా చర్యలు తీసుకోవాలని, వలలు, నావలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఎస్టి, ఎస్సీ,బీసీలకు 75% పెంచాలి అని, మత్స్యకార సొసైటీ గ్రామలలో మత్స్యకార కమ్యూనిటీ హాల్ నిర్మించడం, మత్స్యకారుల వాహనాలు ఇచ్చే రాయితీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలనే పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకి అందజేశారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జిల్లా మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
