సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:రాష్ట్రంలో అధికార టీడీపీ కూటమి వారు ప్రతిష్టాకరమైన పదవిలో ఉన్న గౌరవ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ ను, వైసీపీ మండలి సభ్యులను ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించకుండా అగౌర పరుస్తున్నారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ టీడీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.నిన్న (మంగళవారం) స్పోర్ట్స్ మీట్, ఫొటోసెషన్ సందర్భంగా మండలి విపక్ష నేతగా నాకు కుర్చీ కూడా కేటాయించలేదని మరియు చైర్మన్ సహా సభ్యులను అవమానించారన్నారు. స్పోర్ట్స్ మీట్ వేదిక, ద్వారాల వద్ద ఫెక్క్సీలలో ఎక్కడ మండలి ఛైర్మన్ ఫొటోలు లేవని, అసెంబ్లీ స్పీకర్ ఫోటోలు మాత్రం వేశారని మండలి ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కించపరుస్తూ, అవమానిస్తున్నారని బొత్స అన్నారు. ఫోటో సెషన్ వద్ద కూడా ప్రొటోకాల్ చూస్తోన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో గౌరవ శాసనమండలికి, సభ్యులకు అగౌరవం వచ్చేలా ఉందన్నారు. దీనికి ప్రతిగా మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ లు మాట్లాడుతూ.. మండలి సభ్యులను ,చైర్మెన్ లను ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని శాసన మండలి సహా ఛైర్మన్ అంటే తమకు అపార గౌరవం ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కూడా కుర్చీ వేయడాన్ని అధికారులు మరచిపోయారని.. తాము చెబితే అధికారులు కుర్చీ వేయడంతో వారు ఫొటో దిగారన్నారు. జరిగిన ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
