సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు నేడు, సోమవారం వారంలో మొదటిరోజూ ఉదయం నుండి భారీ లాభాలతో మొదలయ్యాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty Record) సూచీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో బ్యాంక్ నిఫ్టీ 57,000 స్థాయిని తాకి, కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊహించని విధంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం, అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో (CRR)ను కూడా తగ్గించడంతో బ్యాంకింగ్ రంగంలో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10.20 గంటలకు బ్యాంక్ నిఫ్టీ సూచీ 56,995.75 వద్ద 0.44% పెరిగి, 411 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 551 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 117 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో కొనసాగుతున్నాయి.
