సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎల్లుండి మంగళవారం అంటే జూన్ 4వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో .. భీమవరం విష్ణు, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పట్టణంలో ఉదయం ఆరు గంటల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు జిల్లా ఎస్పీ వి.అజిత ప్రకటించారు. ఈ విషయం వాహనదారులు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు. విజయవాడ, గుడివాడ వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కాళ్ళ మండలం పెదఅమిరం పుంత రోడ్ మీదుగా, ఉండి రోడ్ చేరుకుని భీమవరం పట్టణంలోకి చేరుకోవాలి. ఇక భీమవరం పట్టణం నుంచి వచ్చే కార్లు, బైక్‌లు వంటి చిన్న వాహనాలు సర్ ఆర్దర్ కాటన్ పార్క్ (జువ్వలపాలెం రోడ్) వద్ద డైవర్షన్ తీసుకుని చిన అమిరం మీదుగా కోపల్లె హైస్కూల్ వద్ద కాళ్ల రోడ్ ఎక్కి గుడివాడ, విజయవాడ వెళ్లవచ్చు. పీపీ రోడ్డు మీదుగా వచ్చే భారీ వాహనాలు 2 టౌన్ బొంబాయి స్వీట్స్ వద్ద ఉండి రోడ్డుకు వచ్చి మల్టీప్లెక్స్ మీదుగా ఉండి, ఆకివీడు, కైకలూరు, విజయవాడ, గణపవరం, ఏలూరుకు.., పెదఅమిరం పుంత రోడ్ నుంచి కాళ్ళ, గుడివాడ, విజయవాడకు వెళ్ళాలి. తాడేపల్లిగూడెం నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లలకోడేరు వంతెన వద్ద డైవర్షన్ తీసుకుని పాలకోడేరు, కుముదవల్లి, మార్కెట్ యార్డు మీదుగా పాలకొల్లు వైపు, భీమవరం పట్టణంలోకి, ఉండి వైపునకు వెళ్లాలి. భీమవరం పట్టణం నుంచి తాడేపల్లిగూడెం, తణుకు వెళ్లే వాహనదారులు బీవీ రాజు విగ్రహం వద్ద నుంచి ఉండి బైపాస్ మీదుగా మార్కెట్ యార్డు, కుముదవల్లి, పాలకోడేరు మీదుగా వెళ్లాలి. జువ్వలపాలెం రోడ్‌లో సర్ ఆర్ధన్ కాటన్ పార్క్ వద్ద నుంచి కాళ్ళ రోడ్, పెదఅమిరం పుంతరోడ్ వరకు నో వెహికల్ జోన్‌గా, ఉండి బైపాస్ రోడ్డులోని బీవీ రాజు విగ్రహం నుంచి గొల్లలకోడేరు విగ్రహం వరకు నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు.
