సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా నేడు, బుధవారం భీమవరం పరిధిలోని అన్ని శివాలయాలు ‘ ఓం శివోహం’ అంటూ భక్త సంద్రంతో నిండిపోయాయి. దాతల సహకారంతో లక్షలాది రూపాయల ఖర్చుతో అందమైన పుష్ప అలంకరణలు తో కన్నుల కైలాసం తలపించే లైటింగ్ కాంతులతో, చలువ పందిళ్ళతో మెరిసిపోతున్న గునుపూడి పంచారామ క్షేత్రం లో చంద్ర ప్రతిష్ట శ్రీ సోమేశ్వరుని దర్శనం కోసం గత అర్ధరాత్రి నుండి భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి పోవడం జరిగింది. అయితే దర్శనాలు మాత్రం తెల్లవారు జాము 2గంటల నుండి ప్రారంభించారు. శివరాత్రి కి భక్తులు కోసం దాతల సహకారంతో ప్రసాద వితరణ, మంచినీరు ఏర్పటు బాగుంది. నేటి ఉదయం 11 గంటల వరకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. దూరప్రాంతాల నుండి వందలాది వాహనాలలో దూరప్రాంతాల నుండి ఒకే రోజు పంచారామ క్షేత్రాలు దర్శించుకొంటున్న భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా వేగంగా భక్తులు శివదర్శనం చేసుకొంటున్నారు. పోలిసుల సహకారంతో దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భీమవరం నడి బొడ్డున ఉన్న 1200 ఏళ్ళ పురాతన ఉమా భీమేశ్వర స్వామి దేవాలయం, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, యనమదుర్రు లోని స్వయం భువుడు శ్రీ శక్తేశ్వర స్వామి , దేవాలయాలలో కూడా వేలాది భక్తులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకొన్నారు. ( పైన అభిషేకాలలో సోమేశ్వరుడు తాజా చిత్రం)
