సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పశ్చిమగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు నూతన పాలకవర్గం భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు,శనివారం ప్రమాణస్వీకారం చేసింది. జిల్లా అధ్యక్షుడిగా ఎండీ కరీముల్లా బాషా, కార్యదర్శిగా ఎండీ సిద్దిఖ్, ఉపాధ్యక్షుడిగా షేక్ ఎండీ షఫీహుర్ రెహ్మాన్, సభ్యులు షేక్ సుభానీ, అబ్దుల్ హై, ఎండీ అబ్దుల్ రహీం, ఎండీ అజర్ ఖురేషి, షేక్ అమీర్ బాషా, చాన్ భాషా, ఖాజావలి, ఎండీ ఖాజా మొహిద్దీన్ సిరాజ్లా ఉన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించారని,..ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం, మైనార్టీ వర్గాల అభివృద్ధికి స్వచ్ఛ హృదయంతో అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముస్లిం, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు పూర్తిగా అందుతున్నాయా? అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందకపోతే ఎందుకు అందడం లేదో తెలుసుకోవాలని, అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని సూచించారు. ముస్లిం నాయకులతో పాటు భీమవరం మండల ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు కోడె యుగంధర్, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల సత్యనారయణరాజు తదితరులు పాల్గొన్నారు.
