సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నాల్గవ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రక్షణ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నేడు, బుధవారం భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగాయాత్ర బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగిన ఈ భారీ ర్యాలీని ప్రారంభించి, స్వయంగా జాతీయ పతాకాన్ని చేతబట్టి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా, కొంతమందిలో నిద్రాణంగా ఉన్న దేశభక్తిని రగిలించడం, స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని యువతకు తెలియజేయడం, దేశం కోసం కాపలా కాస్తున్న లక్షలాదిమంది సైనికులకు “మేము మీకు అండగా ఉన్నాము” అనే భరోసా కల్పించడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు. గతంలో దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు సుమారు 100 దేశాలకు బ్రహ్మోస్ వంటి రాకెట్లను, ఇతర రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది దీనితో దేశానికి రూ. 80 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
