సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో గత ఆదివారం రాత్రి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి డా.బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు. తొలుత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పూలమాల వేయగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి సహా అతిథులు పూలతో నివాళులర్పించారు. సభలో కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గునుపూడిలో నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. భారతదేశంలో రాజ్యాంగం ఒక దిక్సూచిగా ఉందన్నారు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు పూజించుకుంటున్నారని, భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలందరిని సమానంగా చూసేదే రాజ్యాంగం అన్నారు అంబేద్కర్ జీవితాన్ని చదవడం వినడం చేశామని ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు చూపారని అభినందనలు తెలిపారు. నాటక కళాకారులకు 50వేలు రూపాయలు బహుమతిగా నరసాపురం ఆర్డీవో దాసిరాజు ప్రోత్సాహకాన్ని కొయ్యే మోషన్ రాజు చేతుల మీదుగా అందించారు. అనంతరం ఉభయగోదావరి జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని రాజ్యాంగ హక్కులకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ మతాన్ని ఉపయోగించి ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారన్నారు.
