సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అయాచితంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉన్న వారిని టార్గెట్ గా పెట్టుకొని దొంగనోట్ల వ్యాపారంలోకి దింపే ముఠా గుట్టు రట్టుఅయ్యింది. భీమవరం వన్‌టౌన్ పోలీసులు వల వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నాగరాజు వివరాలు తెలిపారు. భీమవరం పట్టణానికి చెందిన కె. జోగ శివశంకర్ దగ్గరకు కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం రెడ్డికాపవరం గ్రామానికి చెందిన కొవ్వూరి గోపీచంద్రరెడ్డి, జంగారెడ్డిగూడెం రాముల చెరువు ప్రాంతానికి చెందిన వేముల మోహనసాయి వచ్చిమీరు అసలు నోట్లు లక్ష రూపాయలు తీసుకురండి… నకిలీ నోట్లు రూ. 3 లక్షలు ఇస్తాం. మీరు ఎంత తెచ్చినా దానికి తగ్గట్లుగా మా దగ్గర నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికారు. అయితే జోగ శివశంకర్‌కు వీరి గురించి కాస్త వాకుబు చెయ్యగా అతని సన్నిహితుడు ఎం.వెంకటరెడ్డి అనే వ్యక్తికి గతంలో రూ. 5 లక్షలు తెస్తే రూ. 15 లక్షలు నకిలీ నోట్లు ఇస్తామని వారు నమ్మించి నోట్ల మధ్యలో తెల్లకాగితాలు పెట్టి మోసంచేసిన ముఠాగా జోగ శివశంకర్ తెలుసుకొన్నాడు. . ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు తెలియపరిచాడు. పోలీసులు చాకచక్యంగా స్కీచ్ వేశారు. జోగ శివశంకర్ రూ. 3 లక్షలు తీసుకుని ఏఎంసీ మార్కెట్ యార్డు గెస్ట్‌హౌస్ సమీపానికి వెళ్ళేసరికి ఒక బ్రీజా కారులో గోపీచంద్రరెడ్డి, మోహనసాయిలు అక్కడకు వచ్చారు. పోలీసులు ఒక్కసారిగా వారి వద్దకు వెళ్ళి వారిని పట్టుకోగా వారి వద్ద రూ. 9 లక్షల నకిలీ డమ్మీ నోట్లు ఉన్నాయి.ఆ కట్టలపైన ఒరిజినల్ రూ. 500 నోట్లు 8 ఉన్నాయి. వెంటనే ఆ రూ. 9 లక్షలు స్వాధీనంచేసుకుని కారును తనిఖీ చేయగా, కారులో రూ. 2 కోట్లు విలువైన డమ్మీ కరెన్సీ నోట్లు రెండు బాక్సులు (400 బండిల్స్) దొరికాయి.దీంతోరూ. 2 కోట్ల 9 లక్షల విలువైన డమ్మీ నోట్లతోపాటు ఒక బ్రీజా కారు, నకిలీ నంబరు ప్లేట్లు 2 స్వాధీనం చేసుకుని వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లుగా సీఐ తెలిపారు. ఇంకా ఈ కేసులో దొంగనోట్లు ఇస్తున్న జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన బర్రె సుధీర్‌ను అరెస్ట్ చేయవలసి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ కిరణ్‌కుమార్, ఎస్వీవీఎస్ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.
