సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం యనమదుర్రు కాలువపై నిర్మించిన మూడు బ్రిడ్జిల్లో రెండు బ్రిడ్జిల అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నిధులు విడుదలైన వివరాలను సోమవారం తెలియజేసారు. 11 ఏళ్ల క్రితం నుంచి అప్రోచ్ రోడ్ల పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయని, దీనిపై ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఒక్క బ్రిడ్జికు మాత్రమే ప్రస్తుతం నిధులకు విడుదల చేస్తామని, త్వరలో చూద్దామని చెప్పేవారని, వారితో ట్రాఫిక్ సమస్యను వివరించడంతో రెండు బ్రిడ్జిలకు రూ 24 కోట్ల 70 లక్షలు అప్రాచ్ రోడ్లుకు నిధులు మంజూరు చేశారని అన్నారు. గంగనమ్మ గుడి దగ్గర, గొల్లవాని తిప్ప దగ్గర ఉన్న బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే మూడో బ్రిడ్జి కు కూడా నిధులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఇక బ్రిడ్జి లకు అప్రోచ్ రోడ్లు పూర్తి అయితే ఇక ట్రాఫిక్ సమస్య తీరినట్లేనని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
