సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ పరిధిలోని బీసీ కాలనీ సమీపాన ఈ నెల 23న రాత్రి జరిగిన రౌడీ షీటర్ ఏసు హత్య కు సంబంధించి అందరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ యు.రవిప్రకాశ్ ప్రకటించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ మాట్లాడుతూ..ఏసును హత్య చేసిన నిందితుల్లో ఒకరైన వడ్డి దుర్గారావుకు రాయలం గ్రామానికి చెందిన రౌడీషీటర్ రౌతుల ఏసు, అతడి తమ్ముడు రఘులతో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఏసు వద్ద దుర్గారావు వడ్డీకి అప్పు తీసుకున్నాడు. దుర్గారావు అప్పు తీర్చకపోవడంతో ఏసు పదేపదే ఒత్తిడి తీసుకురావడం తో పాటు కొంతమందిని అతడి ఇంటికి తీసుకెళ్లి తన బకాయి క్రింద దుర్గారావు ను భయపెట్టి అతని షెడ్డును తక్కువ ధరకు అమ్మించాడు. ఈ క్రమంలోనే పగతో దుర్గారావు ఏసును చంపేందుకు కొందరు యువకులతో ప్లాన్ వేసాడు. ఏసు సోదరుడు రౌతుల రఘు కూడా ఒక కేసు విషయం లో ఇటీవల జైలుకు వెళ్లడం తో ఇదే అదనుగా భావించి, ఈ నెల 23న రాత్రి ఆ యువకుల సహాయంతో ఏసును గొడ్డలి, రెండు కత్తులతో విచక్షణారహితం గా దాడి చేసి హతమార్చి పరారయ్యారు. హత్య కు పాల్పడినవారంతా భీమవరానికి చెందినవారే. ఈ కేసులో వడ్డి దుర్గారావు, బెవెర గోవిందరావు, ద్రోణాద్రి సాయి వంశీ, బెవర విజయ్ బాబు , ఈదా మోసేను, నక్కా డేవిడ్, తాడి దుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం ఎస్డీపీవో బి.శ్రీనాథ్, సీఐ బి.కృ ష్ణకుమార్, ఎస్సై లు పి.అప్పా రావు, వి.రాంబాబు, సిబ్బంది ని ఎస్పీ అభినందించారు. అలాగే ఇటీవల చోరీకి గురియైన 105 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బాధితులకు భీమవరంలోని జిల్లా పోలీసు కార్యాలయం లో ఎస్పీ రవిప్రకాశ్ గత శుక్రవారం అందజేశారు. వీటి విలువ రూ.26 లక్షలు గా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *