సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు గత శనివారం రాత్రి (ది.29.04.2023న) 15వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయని ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ డాక్టర్ దసిక సూర్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుళ జాతి సంస్థ మావనీర్ గ్రూప్ (ఆర్ & డి) డైరెక్టర్ శ్రీ అవినీష్ కుమార్ గోయల్ మరియు గౌరవ అతిథిగా శ్రీ విష్ణు ఎడ్యుకేల్ సొసైటీ చైర్మన్ శ్రీ కె.వి విష్ణు రాజు విచ్చేశారు.అవినీష్ కుమార్ గోయల్ మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా అధునాతన పద్ధతులను అవలంబించి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని చదువుతోపాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపాలని అన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టబద్ధడైనను కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి వివిధ విభాగాలను అనుసంధానిస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నానని తననే ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. కె.వి విష్ణు రాజు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ పూర్తయ్యాక విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో విజయం కోసం గట్టి ప్రయత్నం చేయాలని, ఇంగ్లీషులో తడబాటు లేకుండా మాట్లాడడం అలవర్చుకోవాలన్నారు అన్నారు.విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నందు ఆరో స్థానంలో నిలవడం గర్వకారణం అని అన్నారు. ఈ సంవత్సరం తమ విద్యార్థులు వివిధ బహుళ జాతి సంస్థల్లో అత్యధికంగా 1266 ఉద్యోగ అవకాశాలు పొందారని వాటిలో తమ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని రజిత “లైట్ బీమ్” అనే సంస్థలో 35 లక్షల వార్షిక ఆదాయంతో ఉద్యోగం సాధించడం గర్వకారణమని అన్నారు. తమ విద్యార్థులు వివిధ బహుళ జాతి సంస్థలలో వందకు పైగా ఇంటర్న్ షిప్ పొందారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 42 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (అడ్మిన్) ప్రసాద్ రాజు, ఏజీఎం రమేష్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. శ్రీనివాస్, క్యాంపస్ నందలి వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కళాశాల వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
