సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో నిర్మిస్తున్న100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏపీఐఎంసీడీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ 100 పడకల ఆసుపత్రి వల్ల నియోజకవర్గ ప్రజలతో పాటుగా నరసాపురం నియోజకవర్గం , అటు కృష్ణ జిల్లా ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సౌకర్యాలతో పాటు, అన్ని విభాగాలకు సంబంధించి స్పెషలిస్టులతో పాటుగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు వేలకోట్ల నిధులను ఖర్చు చేస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో దాదాపుగా 3 వేల 400 కు పైగానే వ్యాధులకు మన రాష్ట్రంలో ఎంపిక చేసిన కార్పొరేట్ ఆసుపత్రులతో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా ఎంపిక చేసిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ పథకంలో ప్రజలు ఉచిత వైద్యాన్ని పొందవచ్చునని అన్నారు. అదే మాదిరిగా వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు భీమవరం పట్టణంలో వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
