సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉద్యోగ కార్మిక ఉద్యమాల సారథి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తిని అభినందిస్తూ భీమవరం లో సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ నిర్వహించింది. స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగిన అభినందన సభకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాజా రామ్మోహన్ రాయ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపి మూర్తి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు లు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న విధానాలు ఉద్యోగ శ్రామిక ప్రజలకు తీవ్ర నష్టం చేసేవిగా ఉన్నాయని వాటిని ప్రజలకు వివరిస్తూ చట్టసభలలో ప్రశ్నించే గొంతుక అవసరమవుతుందని అన్నారు. చట్టసభలలో పాలకవర్గాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగ కార్మికులు, స్కీం వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఉద్యోగులు, కార్మికులు, చదువుకున్న వారు పాలకులు చూపించే భ్రమలకు, డబ్బులకు లోను కారని అన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు , సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి గోపాలన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయస్ఫూర్తితో త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా సాధించాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డివి రాఘవులు పోటీ చేస్తున్నారని ఉపాధ్యాయుడుగా, ఉద్యమాల నేతగా వివిధ సంఘాలను నడిపించిన అనుభవంతో ఉన్న డివి రాఘవులు శాసనమండలిలో మన తరఫున నిలబడతారని అన్నారు. ఈ అభినందన సభలో సిఐటియు జిల్లా నాయకులు బి వాసుదేవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆకుల హరే రామ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం నాయకులు మామిడి శెట్టి రామాంజనేయులు, అంగన్వాడి నాయకురాలు కే ఝాన్సీ లక్ష్మి, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు డి జ్యోతి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు చైతన్య ప్రసాద్, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు కోటేశ్వరరావు, గోపి మూర్తిని అభినందిస్తూ మాట్లాడారు.
