సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి జిల్లా కలెక్టరేట్ తరలింపు పై వస్తున్న ప్రచారంపై జిల్లా కలెక్టర్ నాగరాణి లేదా , కానీ స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు కానీ తక్షణం స్పష్టతను ఇవ్వాలని, అదేగనుక నిజమైతే ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి.గోపాలన్ హెచ్చరించారు. నేడు, బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.బలరాం, బి.వాసుదేవరావు లతో కలిసి జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి.గోపాలన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం భీమవరం పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డులో 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టరేట్ కి కేటాయిస్తూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. జిల్లా నలుమూలల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డ్ ని కేటాయించారన్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ ని తరలిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోందని, దీనివల్ల ప్రజలకు గందరగోవల పడుతున్నారన్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందని ఉద్దేశంతో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించారని, పట్టణంలోనే ఉన్న ప్రకృతి ఆశ్రమంలో ఉన్న భవనంలో తాత్కాలికంగా కలెక్టరేట్ ని నిర్వహిస్తున్నారన్నారు. ఇటీవల కలెక్టరేట్ ని అసలు భీమవరంలోనే కాకుండా మారుమూల ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రచారం సాగుతూఉందని తెలిపారు. నిజంగానే మారుమూల ప్రాంతానికి ఉద్దేశపూర్వకంగా తరలించాలని చూస్తే సహించబోమని, జిల్లావ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
