సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో, పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, జట్టు ఐక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన పోలీస్ క్రికెట్ లీగ్ పోటీలు నేడు, బుధవారం ఘనంగా ముగిశాయి. భీమవరం డిఎన్నార్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలు పోలీసు సిబ్బందిలో అపూర్వ ఉత్సాహాన్ని నింపాయి.టోర్నమెంట్‌లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల ప్రతినిధులతో ఏర్పడిన జట్లు పరస్పర క్రీడాస్ఫూర్తితో పోటీపడి, అభిమానులను ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., ఆధ్వర్యంలోని ఎస్పీ ఎలెవన్ టీమ్, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ టీంపై అద్భుత విజయం సాధించి విజేతగా నిలిచింది.
