సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లోని పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పాత బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాత బస్టాండ్ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. భీమవరం అభివృద్ధిలో భాగంగా 1962లో ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమయ్యే దూర ప్రాంతాల బస్సులు అన్నీ కూడా పాత బస్టాండ్ కు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాతలు సిహెచ్ రామ్ బద్రిరాజు రూ 30 లక్షలు ఖర్చు చేసే నూతన బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానన్నారు. ప్రజలు, దాతలు, అధికారులు సహకారాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ను జూన్ 28 నాటికి పూర్తి చేయుటకు లక్ష్యంగా పెట్టుకుని పనులను చేపట్టడం జరిగిందన్నారు.
