సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఏరియా ఆసుపత్రికి పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ మిషన్ పథకంలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్స్ ఏర్పాటుకు 23 కోట్ల 75 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడంతో ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నేడు, శుక్రవారం భీమవరంలోని బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్స్ ఏర్పాటు చేయటం వల్ల జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. భీమవరంలోక్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్స్ విభాగం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను ఢిల్లీలో కలిసి తాను గత డిసెంబర్ పదో తేదీన విజ్ఞప్తి చేయడం జరిగిందని, అయన సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి త్వరగా నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్, నర్సాపురం రైల్వే స్టేషన్ లలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు 32 కోట్ల 37 లక్షలు రూపాయలతో అమృత్ భారత్ పథకంలో పనులు జరుగుతుండగా ఇప్పటికీ 55% పనులు జరిగాయి అన్నారు. ఎన్ హెచ్ 165 బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేందుకు నేషనల్ హైవే అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాల ప్రకారం పీఎం గతిశక్తి అధికారులకు నివేదికను సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సిఎస్ఆర్ నిధులను నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందని, మరిన్ని నిధులను సాధించి అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాస వర్మ తెలిపారు.
