సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కామాఖ్య – చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు భీమవరం టౌన్ స్టేషన్ లో నేడు, ఆదివారం ఘన స్వాగతం లభించింది. తణుకు నుండి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భముగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు అత్యున్నత సౌకర్యాలతో కూడిన హై-స్పీడ్ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పమే ఈ అమృత్ భారత్ రైలు అని కొనియాడారు. తన కృషి మేరకు భీమవరం, తణుకు ప్రాంతం గుండా ఈ రైలు ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలను వారికి వివరించడంతో రైల్వే అధికారులు కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో కేవలం 500 రూపాయలకే 1000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, కామాఖ్య అమ్మవారిని దర్శించుకునే భక్తులకు, ఈ ప్రాంత ఆక్వా ఉత్పత్తులను ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేసే వర్తకులకు ఈ రైలు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాల కార్మికులకు ఇది వరమని ఆయన అభివర్ణించారు. తాడేపల్లిగూడెంలో విశాఖ – హైదరాబాద్ వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలని, అలాగే నరసాపురం నుండి విశాఖపట్నంకు పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించాలని తాను చేసిన ప్రతిపాదనకు అధికారులు సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు.​ విజయవాడ నుండి బెంగళూరుకు త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ సర్వీస్‌ను కూడా నరసాపురం నుండి భీమవరం మీదుగా నడిపేలా, ఇంకా వారణాసికి నరసాపురం నుండి ప్రత్యేక రైలు నడిపేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నట్లు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *