సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం నుండి బకాయిలు రాక విసిగిపోయిన భీమవరం కాంట్రాక్టర్లు ఇటీవల.. గతంలో మునిసిపల్ కౌన్సిల్ ప్యానెల్ స్పీకర్ గా పనిచేసిన ప్రస్తుత కేంద్రమంత్రి శ్రీనివాస వర్మను కలిసి తమ సమస్యలను గత మంగళవారం సాయంత్రం విన్నవించుకున్నారు. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 172 పూర్తి చేసిన పనులు నిమిత్తం రూ. 18 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం నుండి తమకు రావాల్సి ఉందని, బకాయి డబ్బులు ఇప్పించి సమస్యను పరిష్కరించవలసిందిగా వారు కోరారు. ఈనేపథ్యంలో భీమవరం మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్టర్లు చేసిన వివిధ పనులకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, అధికారులతో సమావేశమయ్యారు. డైరెక్ట్ గా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఫోన్ చేసి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరితంగా బకాయిలు విడుదల చెయ్యటానికి ఆయన భరోసా ఇచ్చారు. ఇక మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధి పోర్టల్లో అక్టోబర్ నాటికి రూ. 25 కోట్ల 34 లక్షల విలువైన మొత్తం 261 పనులకు సంబంధించిన బిల్లులను నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిలో 89 పనులకు గాను రూ. 6 కోట్ల 54 లక్షల నిధులు ఇప్పటికీ కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఇంకా 172 పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ. 18 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం నుండి రావాల్సిఉందని ఆయన కేంద్రమంత్రికి వివరించారు.
