సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు తొలగించి వారి కడుపులు కొట్టొద్దని వారిని రోడ్డుమీదకు లాగొద్దని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు స్ధానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతిలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక టీపీ గూడెం వైపు .. గరగపర్రు రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు లంకపేటలోని సుమారు వంద కుటుంబాలకు ఆదేశాలిచ్చి, ఇప్పటికే రోడ్ల ప్రక్కన ఆక్రమణలు శరవేగంగా తొలగిస్తున్న నేపథ్యంలో బాధితులు సిపిఐ నాయకత్వంలో నేడు, మంగళవారం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరులకు వినతి పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల మాట్లాడుతూ.. ఎనభై ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలను రోడ్డు విస్తరణ పేరుతో ఖాళీ చేయమనడం దారుణమని విమర్శించారు. బాధితులకు అప్పటి నర్సాపురం సబ్ కలెక్టర్ ఎం.టి.కృష్ణబాబు ఇళ్ల పట్టాలిచ్చి గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లు కట్టించి ఇచ్చారని తెలిపారు.వారికి పక్కాగా నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి అప్పుడు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ .. అధికారుల ఆదేశాలు పరిశీలించి న్యాయం చేస్తామని రోడ్డు విస్తరణ ఎక్కడ వరకు కావాలి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నారు తదితరాంశాలపై ప్రత్యామ్నాయం ఏమిటి అనేదానిపై బాధితులతో కూడా మాట్లాడి న్యాయం చేస్తామన్నారు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాంప్రసాద్, జిల్లా సమితి సభ్యులు వై.వి.ఆనంద్, బాధితులు పత్తి శంకర్, యడ్ల పుష్పవతి,జ్యోతి, మైనం చంద్రకళ, కబీర్ పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *