సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీకోసం) కార్యక్రమ వేదికలో తాత్కాలిక మార్పు జరిగింది. రేపు అనగా జనవరి 5, సోమవారం నాడు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి బదులుగా, భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించనున్నారు. గతంలో గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్న కారణంగా, ఫిర్యాదుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున, తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు ఈ వేదిక మార్పును గమనించి, సోమవారం ఉదయం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.
