సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : భీమవరం డీఎస్పీ శ్రీనాథ్ కాళ్ళ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోస్తా ఆంధ్రలో విద్యాకేంద్రంగా పేరొందిన భీమవరం పట్టణంలో కాలేజీలలో చదువుకునే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు ఉన్నాయని, యువత మత్తు పదార్థాలకు, బెట్టింగ్ చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు కోల్పోతారని తల్లి తండ్రులు వీరిని గమనించాలన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో కాళ్ళ మండలం కోపల్లె హైస్కూల్ ఎదురుగా ఉన్న రోడ్డులో గత గురువారం రాత్రి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 320 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాళ్ళ మండలం బొండాడ గ్రామానికి చెందిన కొండపర్తి మణికంఠ, పోడూరు మండలం పెనుమాదం గ్రామానికి చెందిన బాలం రవికుమార్‌లు ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన గంజాయిని ఈ ప్రాంతంలో అమ్మకాలు చేస్తుండటంతో కాళ్ళ ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారన్నారు. వీరి వద్ద నుంచి 14 చిన్న చిన్న పొట్లాల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఇక ఇదే మండలంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఏలూరుపాడుకు చెందిన కన్నా మహేష్, కీళ్ళ సందీప్‌వర్మ, నల్లగచ్చుల శ్రీనివాసు ఏలూరుపాడు శివారులో చేపల చెరువులు మధ్య ఉన్న రేకుల షెడ్డు వద్ద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు చేసిన దాడిలో సందీప్‌వర్మ, శ్రీనివాస్‌లు తప్పించుకుని పారిపోగా వీరికి కాపలాగా ఉన్న ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామశివారు కమతవానిగూడెంకు చెందిన విపర్తి యోహాను పట్టుకొని వారి నుంచి రూ.12,500 నగదు, 9 సెల్‌ఫోన్లు, 2 మోటార్ సైకిళ్ళు, ల్యాప్‌టాప్, టీవీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.కాళ్ళ ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
