సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి మరియు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.ఈ క్రీడా సంబరాల్లో భాగంగా క్రీడాకారులకు చెస్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 పైగా పార్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని. నరేంద్ర మోదీ మాట్లాడుతూ ..భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దిశగా అడుగులు వేస్తోందని, ఆ లక్ష్య సాధనలో భాగంగా అప్పటికి దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను ఇప్పుడే గుర్తించి, మెరుగైన శిక్షణ ఇవ్వడంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ కీలక పాత్ర పోషిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.2014కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలేవని, ఆ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకతను తీసుకువచ్చామని పేర్కొన్నారు.
