సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో 8 దశాబ్దాలుగా జిల్లాలోనే ఉన్నత విద్య సంస్థగా వెలుగొందుతున్న డి.యన్.ఆర్ కాలేజి అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో డి.యన్.ఆర్. విద్యాసంస్థల పూర్వ విద్యార్ధుల సమావేశం ఘనంగా నిర్వహించారు. నేటి శనివారం ఉదయం నుండి వృద్దులు, మధ్య వయస్కులు , యువతరం వేలాదిగా తరలివస్తూ పూర్వ విద్యార్థులు తరలి వచ్చి తమ మధుర జ్ణాపకాలు పంచుకొన్నారు. వేదికపై సాంస్కృతిక ప్రదర్సనలు ఆకట్టుకొన్నాయి. నిర్వాహకులు పానీయాలు చిరు తిండ్లు, మధ్యాహ్నం విందు తో మంచి ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి వర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ, పాల్గొని డి.యన్.ఆర్ కళాశాలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని అంతేకాక, ఒక విద్యార్ధిగా, విద్యార్ధి నాయకునిగా అధ్యాపకునిగా పాలక వర్గంలో సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాలలో పనిచేసే అవకాశం కలిగింది ఆ అనుభవం నాకు ఈ రోజున కేంద్ర మంత్రి స్టాయికి ఎదగటానికి కొంత మేర సహాయ పడిందని అన్నారు. అలుమ్మి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రొ. వి.యస్ రాజు మరియు పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు మాట్లాడుతూ.. నాడు స్వర్గీయ దంతులూరి నారాయణరాజు గారు మరియు తదితర ధార్మిక వేత్తల సహకారంతో ఏ ఆశయాలతో కళాశాలను ప్రారంబించారో వాటిని నేటి వరకూ ఆచరిస్తున్నామని అన్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. విద్యా సంస్థలలో పూర్వ విద్యార్ధుల పాత్ర అనిర్వచనీయమైనదని అందువల్ల ఆయా సంస్థల ప్రగతికి కేవలం పూర్వ విద్యార్ధులే కాకుండా పారిశ్రామిక సంస్థలు ఆర్దిక సహాయాన్ని అందించాలని తెలిపారు. ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి , మాజీ ఎమ్మెల్సీ ఆది రెడ్డి అప్పారావు కాలేజీ తో తమ అనుభవాలు వివరించారు. డి.యన్.ఆర్ పాలకవర్గ కార్యదర్శి, గాదిరాజు సత్యనారాయణ రాజు(బాబు) మాట్లాడుతూ.. ప్రస్తుతం డిగ్రీ స్టాయిలో సాంప్రదాయ కోర్సుల పట్ల యువతకు ఆసక్తి లేనందున ఇంజనీరింగ్ కాలేజి లోనూ డిగ్రీ కాలేజి లోనూ అనేక రకాల కంప్యూటర్ ఆధారిత కోర్సులను ప్రవేశ పెట్టామని, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆక్వా కల్చర్ , అప్లయిడ్ లైవ్ సైన్సెస్ ఆధారిత కోర్సులను కూడా ప్రవేశ పెట్టామని అన్నారు. పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు మాట్లాడుతూ.. డి.యన్.ఆర్ అలుమ్మి అసోసియేషన్ ను పునర్జీవనం చేయడానికి ప్రదాన కారణం విద్యాసౌకర్యాలు కల్పించటంలో యాజమాన్యాలకు పూర్వ విద్యార్ధులు కూడా సహకరిస్తే సమాజంలో విద్యార్ధులు మంచి పౌరులుగా ఉన్నత స్దాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. త్వరలో డి.యన్.ఆర్. కాలేజిలో నర్సింగ్ కోర్సును ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకరాజు రామం,మెంటే పార్ధ సారధి, డి.యన్.ఆర్ అలుమ్మి అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, సెక్రటరీ బొండా రామకృష్ణారావు(రాంబాబు), పట్టణ ప్రముఖులు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
