సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం కూడా ఏపీ శాసనమండలి సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు తిరుమల నెయ్యి అంశంపై చర్చ జరపాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.అయితే చర్చకు ప్రభుత్వం ఆమోదం లేకపోవడంతో యధావిధిగా మండలి చైర్మన్ కొయ్య మోషేను రాజు దీనిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీనిని నిరసిస్తూ వైసీపీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎందుకు ప్రభుత్వం లడ్డు నెయ్యి హిండాపూర్ డైరీ విషయం లో చర్చకు భయపడుతుందో అర్ధం కావడంలేదని, టెండర్ దక్కించుకున్న అదే కంపెనీ నెయ్యి ప్రజలకు హైదరాబాద్ మార్కెట్ లో 560 రూపాయలకు అమ్ముతుంటే తిరుమలకు మాత్రం ఏకంగా 658 రూపాయలకు అమ్ముతూ శ్రీవారి సొమ్ము దోపిడీ చేస్తున్న వైనం బయట పడుతుందని భయపడుతున్నారో ? లేదా ప్రజలకు అమ్ముతున్న నెయ్యి కల్తీ చేసారా?తెలియడం లేదని, అసలు చర్చకు అనుమతిస్తే దీనివెనుక పెద్దల బండారం బయట పడుతుందని, సభలో మా వైసీపీ ఎమ్మెల్సీ లు మాట్లాడుతున్నప్పుడు లైవ్ లో కనీసం చూపించడం లేదని ఇంతగా ప్రభుత్వం భయపడుందంటే ? ప్రజలకు అర్ధం అవుతుందని ఆరోపించారు. ఇక నిరసన మరింత ముదరి వైసీపీ సభ్యులు ఏకంగా చైర్మన్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. పోడియం ఎక్కడం చైర్మన్ స్థానాన్ని అవమానపరచడమేనని,మార్షల్స్‌ను పిలిపించి, నిరసనకారులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. సభ్యుల అతిని అదుపు చేయకపోతే చైర్మన్ వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
