సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత లోక్‌తక్ (Loktak) సరస్సును సందర్శించారు. ప్రకృతి ఒడిలో అద్భుతంగా వెలిసిన ఈ సరస్సు అందాలను చూసి ఆయన అబ్బురపడ్డారు. ప్రపంచంలోనే ఏకైక ‘ఫ్లోటింగ్ నేషనల్ పార్క్’గా పేరుగాంచిన కైబుల్ లామ్జావో (Keibul Lamjao) జాతీయ పార్కును తిలకించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థిరమైన నేల ఉండకుండా ‘ఫుమ్డీలు’ అని పిలిచే పచ్చని గడ్డి దీవులు నీటిపై అలవోకగా తేలియాడుతుండటం అత్యంత ఆశ్చర్యకరమని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సరస్సు ఒక అందమైన తేలియాడే నగరాన్ని తలపిస్తోందని, ప్రకృతి ప్రసాదించిన ఇటువంటి అద్భుతాలు దేశ పర్యాటక రంగానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.
