సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు, సోమవారం మధ్యాహ్నం ఎక్స్ వేదికగా ప్రజలతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందంటూ ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా చేస్తున్నారని, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రశ్నించిన వారిని అణచి వేసే పాలన చేస్తున్నారని అన్నారు. అమరావతి మహిళలపై తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదన్నారు. గతంలోనే ఒక ఛానెల్ లో ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడని అన్నారు. , ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, అభిప్రాయాలకు యాంకర్‌కు ఏమిటి సంబంధం? ఆలా అయితే మీ ఎల్లో మీడియా ఛానెల్స్ లో డిబేట్ లో వైసీపీ లక్ష్యంగా వక్తలతో పాటు హోస్టులు కూడా చాల దారుణంగా వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారని.. గతంలో మనం చూడలేదా?.. అవి ఇప్పటికీ కొనసాగడం లేదా? అని ప్రశ్నించారు. ఒక పథకం ప్రకారం లేని వాటిని సాక్షి కి అపవాదు ఆపాదిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఆ టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, సాక్షి మీడియాపైనా కార్యాలయాల మీద దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీరు ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండంటూ హెచ్చరించారు.
