సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి నేడు, గురువారం వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ముద్రగడ నివాసంలోనే ఆయనతో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇంచార్జి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు.అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలిశాం. ఈ సందర్బంగా ముద్రగడను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించాం. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ. అయన ఎదో ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదు. స్వతహాగా నిర్ణయం తీసుకొనే స్వతంత్ర భావాలూ ఉన్న వ్యక్తి , సీఎం జగన్‌కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసు. ముద్రగడకు కు ఆయన కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం ఇస్తారు’ అని అన్నారు. ముద్రగడ ఈనెల 12వ తేదీ లోపే సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరతారని భావిస్తున్నారు.
